Monday, September 21, 2009

జీవనకాలం


రేపటి దేవుళ్ళు


దువ్వూరి రామిరెడ్డిగారు "పానశాల" అనే పద్యకావ్యంలో ఉమర్ ఖయ్యాం చేత ఇలా అనిపిస్తారు--'మునుపు మసీదువాకిట ముచ్చెలు దొంగిలిపోతి, పాతవై చినిగెను. నేడునున్ వందల చెప్పులకోసమె వచ్చినాడ; నెమ్మనము సెడంగ నియ్యెడ నమాజొనరింపగరాను, నీవు చచ్చినయెడ వీడిపోయెదవు--చెప్పువోలె నమాజు సైతమున్" అని. 


ఇదివరకోసారి మసీదుకి చెప్పులు దొంగతనం చెయ్యడానికి వెళ్ళాను. అవిప్పుడు చినిగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త చెప్పులకోసం మసీదుకు వెళుతున్నాను, కాని నమాజు చెయ్యడానికి కాదు. యెందుకంటే చచ్చాక చెప్పుల్లాగే నమాజు కూడా ఈ లోకం లో వదలి పోతావు--అని తాత్పర్యం.  


దండాలు సోములోరికి, భక్తి చెప్పులమీదికి--అన్న సామెత మనకీ వుంది. మరికొందరికి దేవుడి మీదకన్న వడపప్పుమీద, చక్రపొంగలి మీద వుంటుంది. మరి తిరుపతి వెంకన్న ఖరీదయిన దేవుడు కనుక ఆయన దగ్గర ఖరీదయిన ప్రసాదాలు రిబేటు మీద దొరుకుతాయి. అందుకనే చాలా మంది చవక ధరల్లొ దధ్ధోజనం, చక్రపొంగలి, వడలూ, లడ్డూలూ కొనుక్కొని తిని కడుపు నింపుకొంటారు. దేవుడి ప్రసాదం తిన్నాక పుణ్యం మాటేమో కాని, వెంటనే కడుపు నిండడం కూడా పుణ్యమే కదా! తప్పు లేదు!  


స్వామివారికి కైంకర్యం చేసే ప్రసాదాలు భక్తులు స్వయంగా చేతితోనే తయారు చేయాలని ఆగమ శాస్త్రకారులు నిర్దేశించిన సంప్రదాయం. రోజుకి ఖర్చయ్యే 80 వేల లడ్డూలను యెంతమంది భక్తులు తయారు చేస్తారో! మరెంతమంది ఆరగించి ఆనందిస్తారో! ఈ ప్రసాదాలు తయారు చేసే హక్కు అనాదిగా వస్తున్న మిరాసీదారుల కుటుంబాలున్నాయి.  


దేవుని ప్రసాదం బాగోగులని ప్రశ్నించకూడదని పెద్దలంటారు. దేవుడి ప్రసాదము ఎలావున్నా తినకపోతే కళ్ళు పోవడమో, ఇల్లు కాలిపోవడమో, మరేదో అనర్థం జరుగుతుందనో, ప్రతి కథల్లో, పురాణాల్లో పెద్దలు భయపెట్టారు. ఎలాగూ నోరుమూసుకొని, భక్తితో భక్తులు సేవిస్తారుగదా అని ఆ ప్రసాదాన్ని చిన్నచూపు చూసిన సందర్భాలూ వున్నాయి. 


అలాంటి చిన్నచూపు ఈ మధ్య వెంకటేశ్వరుని లడ్డూలమీద పడిందన్న విషయం తెలిసొచ్చింది. ఏడుకొండలవాని లడ్డూల్లో మేకులూ, బాకులూ లాంటివి ఈ మధ్య ఓ భక్తునికి దొరికాయట--లడ్డూతో పాటు ఒక మేకు కూడా దేవుడు ప్రసాదించాడని, ఈసారి ఏ మిడతో, ఉడతో, రూపాయిబిళ్ళో, బంగారం ముక్కుపుడకో దొరకవచ్చునని ఆ భక్తుడు ఉదారంగా ఆలోచించలేకపోయాడు. మరి స్థలపురాణాల ప్రకారం ఆ భక్తునికి ఎంతో కొంత పాపం వచ్చే వుంటుంది.  


లడ్డూలకు బూజు పట్టిందని మరొకాయన అన్నాడాట. బూజు పడితే దులుపుకొని, 'వెంకట రమణా' అని మూడుసార్లు ఉచ్చరించి మింగెయ్యాలికాని ఫిర్యాదులు చెయ్యడం మహా పాపం. కాగా ఆ బూజులోనే మనిషికి అమరత్వం సిధ్ధించే యోగాన్నో, బూజులాగా ఐశ్వర్యాలు అల్లుకొనే అదృష్టాన్నో దేవుడు ప్రసాదించాడని ఆ భక్తుడు ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడో తెలీదు. కాక ఆ బూజు తమ దగ్గర నిలవ వుండడంవల్ల వచ్చినది కావచ్చు. అయినా నిలవుంటే మనుషులే బూజుపట్టిపోతున్న ఈ రోజుల్లో లడ్డూల గురించి అలా ఆవేదన పడడం ఏమీ బాగోలేదు. దొరికింది మేకు కనక అయ్యగారు ఫిర్యాదు చేశాడుగానీ, లడ్డూలో స్వామివారి వజ్రమో, వైడూర్యమో దొరికివుంటే ఆయన ఫిర్యాదు చేసేవారా? లడ్డూ చుట్టూ నూరురూపాయల నోటువుంటే అలా నిందించేవారా? 


నాకయితే లడ్డూలో మేకులు రావడం అక్కడి వంటవారి అశ్రధ్ధగా కాక, భక్తులకు రాను రాను భక్తి సన్నగిల్లి పోవడానికీ, స్వామివారి ప్రసాదాలపై పవిత్రభావం లుప్తమైపోవడానికీ తార్కాణంగా కనిపిస్తోంది.  


ఆ విషయం బయటపడ్డాక మిరాసీ దారులు కోపంగా పత్రికలకెక్కారుకాని, కాస్త ఖర్చయితే అయిందనుకొని, రోజుకి రెండు మూడు లడ్డూల్లోనైనా--చిన్న బంగారం తునకలూ, స్వామివారి లాకెట్లూ పెట్టవలసింది. అప్పుడు భక్తులు తేలుకుట్టిన దొంగల్లాగ వందలాది లడ్డూలు కొనుక్కొని, రహస్యంగా బంగారాన్ని దాచుకొనేవారు. తేలుమందు కొన్నవారికి జయమాలిని ఫోటో ఉచితం అనో, పదిసార్లు సినిమా చూస్తే పాతచెప్పులు ఉచితం అనో ప్రకటనలు మనం చూస్తూ వుంటాం కదా!--అలా ఈ లోపాన్ని అవకాశం చేసుకోవడం తెలీని అమాయకులుగా నాకు వంటవారు కనిపిస్తున్నారు.  


ఎక్కువ ఔదార్యంగల ప్రముఖ భక్తులు మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శంకర్ దయాళ్ శర్మగారు--ఈ వివాదం గురించి బాధపడుతూ మన ఇళ్ళల్లో వంటల్లోనే రాళ్ళూ రప్పలూ వస్తాయి. అంత పెద్ద ఎత్తున చేసేవాటిలో వస్తే సర్దుకుపోవాలి అంటూ సర్ది చెప్పారు. చిన్నవంటల్లో రాయివస్తే పెద్దవంటల్లో బండరాయిరావచ్చు. చిన్నవంటల్లో మేకు వస్తే పెద్దవంటల్లో గంటస్థంభమో, గల్లాపెట్టో వుండొచ్చునన్నదే వారి తాత్పర్యం. ఆమాత్రం భక్తులు అర్థం చేసుకోకపోవడం శోచనీయం.  


లడ్డూల స్థాయిపెంచలేక--రాశినిపెంచుతూ కావలసినన్ని లడ్డూలు తయారుచేయలేక దేవస్థానం వారు ఈమధ్య యిబ్బంది పడుతున్నారట. మనిషికి రెండు లడ్డూలుమాత్రమే రేషన్ గా యిస్తున్నారట. అంటే దైవదర్శనం చేసుకున్నవారికి దేవుడు పదికిలోల పుణ్యం ఇవ్వొచ్చుకాని, దేవస్థానం వారు రెండు లడ్డూలు మాత్రమే ఇస్తారట. ఈ మధ్య దేవుడిని గంటలో దర్శించి, లడ్డూల కోసం నాలుగు గంటలు క్యూలో నిలబడాల్సి వస్తోందని నిన్ననే స్వామిని దర్శించి వచ్చిన ఒక భక్తుడు చెప్పగా విన్నాను.  


ఈ సమస్య సులువుగా పరిష్కరించే మార్గాలు నాకు తెలుసు. గ్యాస్ పొయ్యిలు పెట్టి శాస్త్రకారుల మూడ్ ను వమ్ముచేసి దేశీయ ప్రమాణాల సంస్థ హయాంలో ప్రసాదాలు తయారుచేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. లడ్డూలలో మరిన్ని మేకులు, రాగినాణాలు, బూజువచ్చేటట్టు చేస్తే భక్తులకు ప్రసాదాలపై మోజు తగ్గుతుంది. లేదా విమానాశ్రయాల్లోలాగా లోహాన్ని గుర్తుపట్టే పరికరాలు లడ్డూలమీద పెట్టి పరిక్షించే పథకం పెట్టాలి.  


(13-9-1985)


(ఇరవైనాలుగేళ్ళక్రితం--ఆప్పటికింకా 'నిత్యాన్నదానపథకం' ప్రారంభం కాలేదు--కొండమీద అన్నిరకాల ప్రాసాదాలూ చవగ్గా దొరికేవి--ఆపం, వడ, దధ్ధోజనం, చక్రపొంగలీ, అరిశె లాంటివి అన్నీ!


ఇక రాళ్ళసంగతేమోగానీ, లడ్డూలు యెక్కువకాలం నిలవ వుంటాయని యెవరో చెపితే, మధ్యలో పటికబెల్లం అచ్చులని వుంచి, లడ్డూలు చుట్టేస్తున్నారు! ఇది ప్రవేశపెట్టిన కొత్తలో యెవరో నాకు లడ్డూ ప్రసాదం ఇవ్వగానే, వెంటనే నోట్లోవేసుకొని నమలబోయేసరికి, పళ్ళూడినంతపనయి, అప్పటినించీ 'తెనాలిరామలింగడి పిల్లి' లా భయపడిపోయి--ఆ లడ్డూ ముక్కని నలుగురిముందూ తినకుండా, దూరం గా తీసుకెళ్ళి, ఓ కాయితమ్మీద జాగ్రత్తగా చిదిపి, లడ్డూనీ, పటికబెల్లం అచ్చుల్నీ వేరుచేసి, విడివిడిగా చప్పరించడం నేర్చుకున్నాను!--కృష్ణశ్రీ)