Wednesday, November 25, 2009

గుప్త ఙ్ఞానులు

నేను హైస్కూల్లో చదువుకునే రోజూల్లో మా మిత్రుల్లో ఒకడుండేవాడు—వాళ్ళ నాన్నగారు సిగరెట్లు కాల్చేవాడు. అయితే కాల్చే ప్రతి సిగరెట్టు వాళ్ళబ్బాయికి తెలియకుండా కాల్చాలని అతని ప్రయత్నం. అందుకని తెగ ప్రయత్నించి యే పెరట్లోనో, దొడ్లోనో కొడుకు స్కూలుకి వెళ్ళిన తరవాత కాల్చేవాడు. వీలైనప్పుడల్లా కుర్రాడికి సిగరెట్లు కాల్చడం లో నష్టాలు వివరించేవాడు.

ఆయన ఆలోచనల్లా ఒక్కటే—తనకి నిస్సహాయం గా అబ్బిన అలవాటు కుర్రాడికి రాకూడదనే—ఆలోచన మంచిదే కాని ఒకరోజు మావాడి పుస్తకాల బీరువా తెరిచి చూస్తే—అందులో అందమైన సిగరెట్టుపెట్టె, అగ్గిపెట్టె దొరికాయి వాళ్ళ నాన్నకి. వాళ్ళనాన్న కుర్రాడిని తప్పించుకు దొంగతనం గా సిగరెట్టు కాల్చినప్పుడల్లా—కుర్రాడు ధైర్యం గా సిగరెట్టు కాల్చుకోవడం ప్రారంభించాడు.

కాగా అలవాటు ముదిరిన తండ్రి కాస్త దగ్గుతుండేవాడు. “ఈ సిగరెట్ల అలవాటు నీకెప్పటినుంచిరా?” అని తండ్రి అడిగితే, “దగ్గురాకుండా సిగరెట్లు కాల్చడం ఎలాగో కనిపెట్టాను. పొగ ఎక్కువ గొంతులోకి పోకుండా వేళ్ళసందున సిగరెట్టునుంచి, పిడికిలి బిగించి పీల్చాలి” అని తండ్రికి ఓ మార్గం నేర్పాడు కొడుకు. దరిమిలానూ ఇద్దరూ ఒకే సిగరెట్టుపెట్టె లోంచి సిగరెట్టు కాల్చడానికి రాజీపడ్డారు. అప్పుడప్పుడు కొడుకు దగ్గర సిగరెట్లు అప్పు పుచ్చుకునేవాడు తండ్రి.

ఇంత వివరం గా ఎందుకు చెపుతున్నానంటే—మనం చేసేపని మంచిదో, చెడ్డదో తేల్చుకోవాలి గాని, అది పిల్లలకు మంచిదో చెడ్డదో తేల్చుకోవాలిగాని, అది పిల్లల్నుంచి దాచడంవల్ల ఆ “చెడు” వాళ్ళకి అంటదనుకోవడం తెలివితక్కువతనం—పెద్దవాళ్ళకో మంచి, చిన్నవాళ్ళకో మంచి ఉండదుకనుక. కాగా, చిన్నవాళ్ళు మరీ చిన్నవాళ్ళు అని మనం అనుకోవడం పొరపాటు. ఈ మధ్య పార్లమెంటులో పెద్దలకోసం తీసే సినిమాలు పిల్లలు చూసి చెడిపోతున్నారని పెద్దలు వాపోయారు. (చెడిపోయే సినిమాలు పెద్దలయినా ఎందుకు చూడాలో అర్థం కాదు). చర్చ అలా సాగుతున్నప్పుడు ప్రముఖ జర్నలిస్టు రచయిత కుష్వంత్ సింగ్ ఈ సలహా ఇచ్చారు—పెద్దల సినిమాలు (“ఎ” సర్టిఫికెట్) చూసే వయస్సు 16 నుంచి 21 కి మారిస్తే మంచిదని, అంటే అప్పటికి—పిల్లలు బుధ్ధి పెద్దరికాన్ని సంతరించుకొంటుందని—కాని నా ఉద్దేశ్యం—ఈ వయస్సు పరిమితిని పదహారు నుంచి 10కి సవరిస్తే మంచిదని. ఎందుకంటే ఈ కాలం కుర్రవాళ్ళు పదేళ్ళు ముందుకుపోయి ఆలోచిస్తున్నారు. చేసే పనులు చేస్తున్నారు.

నేను నటించిన చిత్రాలు ఇంతవరకు కేవలం రెండే రిలీజయ్యాయి. ఈ మధ్య ఒకింటికి వెళ్ళాను—ఓ పదేళ్ళ అమ్మాయి కిసుక్కున నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది.

నన్నుచూసి—“దటీజ్ సుబ్బారావు వచ్చారు తాతయ్యా” అని చెప్పడం వినవస్తోంది. న్యాయం గా ఆ వయస్సు అమ్మాయి చూడకూడని సినిమలు చూసి చెడిపోతారని ప్రభుత్వం భావించి, “ఎ” సరాటిఫికెట్ ఇచ్చిన సినిమాలు. ఆ తాతయ్యగారు కూడా వారి మనుమరాలు నా సినీమాలు చూసి ఆనందించినందుకు ఎంతో ఆనందించారు.

ఏ దేశమో గుర్తులేదు—టి వి లో పిల్లలు చూడకూడని పెద్దల చిత్రాలు—రాత్రి బాగా ముదిరాక—వేస్తారట—ఉద్దేశ్యం—అప్పటికి పిల్లలు నిద్రపోతారు కనుక నిశ్చింతగా పెద్దలు చూడవచ్చునని. కాని జరిగేదేమిటంటే మందుకొట్టి పెద్దలు నిద్రపోతే—ఆ సినిమాలు చూడడానికి పిల్లలు శ్రధ్ధగా మేలుకొని చూస్తుంటారట.

దాచిన గుప్పెట్లో ఉన్నదేమిటో వెదకాలని ప్రయత్నించడం ప్రతివాడికి సరదా. ఆ గుప్పెటిని బిగించినకొద్దీ చూడాలనే ఉత్సాహం పెరుగుతూంటుంది. ఈ కాలం కుర్రకారుని తక్కువ అంచనా వేస్తున్నారని నా మనవి. సినిమావాళ్ళు బహుశా కుర్రాళ్ళని దృష్టిలో పెట్టుకొనే ఊరుకి రెండుమూడు థియేటర్లలో సినిమాలు రిలీజు చేసుకుంటారు. కుర్రాళ్ళు సినీమాలు చూసి చెడిపోతారని ఇబ్బందిపడే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా—వాళ్ళు ఒక థియేటర్లో చూస్తే—వీళ్ళు మరో థియేటర్లో అదే చిత్రాన్ని చూసి ఆనందిస్తుంటారు.

ఈ మధ్య మా మిత్రుడూ నేనూ ఒక బార్ కి వెళ్ళాం—“ఇదేమిటయ్యా—బయట కుర్చీలుండగా లోపల కూర్చుందామంటారు” అని వెంటబడ్డాను—ఎంత చెప్పినా లోపలే కూర్చుందామంటాడాయన. నేను మరీ బలవంతం చేస్తే విసుగ్గా అన్నాడు: “బయట వద్దయ్యా—అక్కడ మా వాడు కూర్చున్నాడు” అని. పిల్లల్ని చూసి పెద్దలు సిగ్గుపడిపోయే రోజులు వచ్చేశాయి!

(12-11-1992) (సరిగ్గా 17 యేళ్ళ క్రితం)

--ఇప్పుడు—ప్రపంచవ్యాప్తం గా గత పాతికేళ్ళుగా జరిగిన ప్రచారం కొంతలో కొంత ఫలించి—సిగరెట్లు తాగే కుర్రవాళ్ళ సంఖ్య చాలా తగ్గింది.

‘గుప్త ఙ్ఞానం’ పిల్లలకీ కలిగించాలనేవాళ్ళు పెరిగారు—ముఖ్యంగా ‘ఎయిడ్స్’ వచ్చాక, ‘కండోం ’ ల ప్రచారాలు వూపందుకున్నక, పెద్దలకీ తప్పడం లేదు—పిల్లలకి వివరించడం! సిటీల్లోను, పెద్ద పట్టణాల్లోనూ—డేటింగ్, ‘నైట్ క్యాప్’లూ, సహజీవనాలూ మొదలయ్యాయి. (అయినా తక్కువ చదువుకున్నవాళ్ళు ఉన్మాదులుగా మారి, ఆడపిల్లల్ని నరకడం, పొడవడం, యాసిడ్లు పొయ్యడం జరుగుతున్నాయి!)

సినిమాల సంగతికొస్తే, ఇప్పుడు అంత సీను లేదనుకుంటా! 1977 నుంచి అనుకుంటా—ఒక్కో సినిమానీ—పెద్ద సెంటర్లలో మూడేసి, కొంచెం చిన్న సెంటర్లలో రెండేసి, థియేటర్లలో విడుదల చేసి, ఒకే ప్రింట్ తో కథ నడిపించేవారు—‘ఫస్ట్ వీక్ కలెక్షన్లు ‘ దక్కితేనే దక్కడం—రెండోవారం సినిమా ఆడుతుందో లేదో—అని! అలా ఉదాహరణకి విజయవాడలో—వన్ టౌన్లో యే శేషమహల్ కో ఇస్తే, రెండో/మూడో టవున్లో యే అలంకార్ కో, అప్సరాకో ఇచ్చి, లబ్బీ పేటలో యే వెంకటేశ్వరాకో, కనక దుర్గాకో ఇచ్చేవారు! కలెక్షన్లనుబట్టి, ఒక వారమో, రెండువారాలో అయ్యాక, పటమట లో రిలీజు చేసేవారు!

ఇక బార్ల సంగతి—అప్పట్లో కొంత దాపరికం వుండేది—ఇప్పుడు, తండ్రి వేరే బార్ కి వెళ్తే, కొడుకు వేరే పబ్ కి వెళ్ళి, తల్లి ఇంకో పార్టీకి వెళ్ళి—ఇలా అందరూ ఒకరికి తెలియకుండా ఒకరు ఇల్లు చేరి, నిద్రపోయి, పొద్దున్నే యేమీ యెరగనట్టూ ‘హాయ్’ చెప్పేసుకుంటున్నారు!

ఇంకేమైనా మారిందా?

విఙ్ఞులే తెలపాలి!
--కృష్ణ శ్రీ