Saturday, December 12, 2009

జీవన కాలం



నమ్మి చెడినవారు లేరు

నేనా మధ్య ఓ వూరు షూటింగ్ కి వెళ్ళాను. ఆ వూరులో దాదాపు ప్రతివీధికీ ఓ చిన్న సైజు గుడి వుంది. కొన్నింటిలో మాత్రమే దేవుడున్నాడు. భక్తులు విరివిగా విచ్చేసి దేవుడిని ఆరాధించి పోతున్నారు. 


దైవభక్తి ఇంత తామరతంపరగా వీధివీధులా వ్యాపించినందుకు ఆనందపడ్డాను. అయితే కొన్ని గుడులలో దేవుడి ప్రతిష్ట జరగలేదు. కొన్ని గుడులు పూర్తికాలేదు. దైవకార్యం ఇలా సగం లో ఎందుకు ఆగిపోయిందా అని ఆశ్చర్యం కలిగి, వాకబు చేశాను. ఒకాయన కసిగా ఒంటికాలిమీద లేచాడు. "అయ్యా బాబూ! అయి ఎలక్షన్ గుళ్ళండి--ఆటిలో దేవుడెలా వుంటాడండి--నీతీ జాతీ లేనివాళ్ళు కట్టిన గుళ్ళండి" అని విసుక్కున్నాడు. ఎలక్షన్ గుడికి అర్థం బోధపడలేదు. మరి కొందరిని అడిగాక ఈ పెద్దమనిషి కోపానికి అర్థం తెలిసింది.  


అవన్నీ ఎన్నికలకి నిలబడిన కౌన్సిలర్లు కట్టించిన గుళ్ళట. ఆయా ప్రజా ప్రతినిధులు పౌరులకు అన్నిటికన్న దేవునిపట్లగల ప్రేమని గ్రహించి, తిండిలేకపోయినా ఫరవాలేదని, చెప్పుకోడానికి దేవుడయినా వుండాలని తీర్మానించి గుడులు నిర్మించాలని అనుకొన్నారట. సాధారణం గా ఈ గుడులు ఎన్నికలలో మూడు నాలుగు నెలల ముందుగా ఓటర్లకి అడ్వాన్సులాగ ప్రారంభమవుతాయిట. మరీ మధ్యలో ఎందుకాగిపోయాయి? "అదాండీ--ఎగస్పార్టీ డబ్బిచ్చి కొనేశాడండి. గుడికి వేయించిన ఇటుక, సిమ్మెంటుతో పెరట్లో పశువుల కొట్టాం కట్టించుకొన్నాడండి".  


ఏమయినా నాకీ రాజకీయ నాయకులమీద కోపం రాలేదు. ఏదోవిధం గా ప్రజలలో ఆధ్యాత్మిక చింతనను రెచ్చగొట్టడం పుణ్యమే అని మన పెద్దలు చెప్పారు. దానికి మన రామదాసు గారే సాక్ష్యం. వారు తానీషా కొలువులో పనిచేస్తూ శాంక్షన్ లేకుండా దేవుడికి గుడీ వగైరా కట్టేశాడు. నగలు కొనేశాడు. తర్వాత కాస్త ఇబ్బందులు పడ్డా పదిమందిలో పేరూ ప్రతిష్టా--అటు పుణ్యం దక్కించుకున్నాడు. ఆయనే "నమ్మిచెడినవారు లేరు" అన్నారు. మరి ఈ రోజున రామ(దాసుని) భక్తులు అక్కడక్కడ వుంటే ఆశ్చర్యం లేదు.  


ఇలా శ్రీరామచంద్రుడిని నమ్మి బాగుపడ్డవాడే మా మిత్రుడు కోటితీర్థాలు. వాడు చదువుకొనేరొజుల్లో అయితే రేషన్ షాపు గుమాస్తానో, లేదా కాబినెట్ మంత్రో అవుతాడని అస్మదాదులం అనుకొనేవాళ్ళం. వాడు ఆ మధ్య ఏ నౌకరీదొరక్క కాస్త పెట్టుబడి ఎలాగో కూడదీసి, వాళ్ళ వూళ్ళోనే ఓ రామకోవెల కట్టించాడు. డబ్బున్నవాడి చుట్టూ కప్పల్లా బంధువులు చేరినట్టు, బెల్లం వున్నచోట చీమలు చేరినట్టు, కోవెల వున్నచోట గవర్నమెంటు ఉద్యోగులు చేరిపోతారు. పాపం వున్నచోట దేవుడు అవతరించడం గతకాలం నాటి మాట. దేవుడు ఉన్నచోట పాపులు అవతరించడం ఈ నాటి మాట.  


డిపార్టుమెంటు ఆఫీసరుగారు వచ్చినప్పుడల్లా గుడి దక్షిణ గోడ పడిపోయినట్టు వ్రాసుకొంటాడు. కోటితీర్థాలు ఆఫీసరుగారికి సదుపాయాలన్నీ చేస్తాడు. దక్షిణం గోడ ఏనాడూ కట్టలేదని ఆఫీసరుగారికి తెలుసు. అసలు కట్టినా శాంక్షన్ డబ్బుల్లో వాటా ఆయనకే దక్కిందని ఆయనకీ తెలుసు. కనక ఏమీ అనుకోరు. కోటితీర్థాలు ఇంట్లో మహా నవేద్యం ఆయనే భోజనం చేస్తారు. అఖండదీపారాధనకి ఆరు డబ్బాల నెయ్యితో, అతనింట్లో పండగలు, పబ్బాలూ అన్నీ గడచిపోతాయి. 


మావాడు ఎప్పుడూ శ్రీరామచంద్రమూర్తి కట్టిన చుట్టు జల్తారు పంచలేవాడతాడు. జరీ కండువాలే ధరిస్తాడు. భక్తులు కొట్టిన కొబ్బరికాయలను వాళ్ళావిడ సరసమయిన ధరలకి హోటళ్ళకు పంపేస్తుంది. ఆవిడ ఎప్పుడూ సీతాదేవిలాగ అమ్మవారి నగలు ధరించేవుంటుంది. ఈ రోజున భార్యాభర్తలు యిద్దరూ శ్రీరాముని వివాహాన్ని వైభవోపేతం గా నిర్వహిస్తుంటారు. ఈ కాలం లో కూడా తనని నమ్మినవాళ్ళకి--అటు కౌన్సిలర్ల దగ్గరనుంచి గవర్నమెంటు ఉద్యోగాలదాకా ఇతోధికం గా సహాయం చేస్తున్న శ్రీరామచంద్రుడు ప్రత్యక్ష దైవమేకాక మరేమౌతాడు?!  


(01-04-1982)  


దాదాపు 18 సంవత్సరాల క్రితం వ్రాసినప్పటికీ ఇప్పటికీ యేమి మార్పు వచ్చింది? ఇంకా తామరతంపరగా గుళ్ళు కడుతూనే వున్నారు--ఇదివరకు యెవరో పుణ్యాత్ములు కట్టిన గుళ్ళకి వున్న ఆస్తుల్ని హరించి, ధూప దీప నైవేద్యాలకి కూడా కరువు చేసి, శిధిలావస్తలో వున్నా యెవరూ పట్టించుకోవడం లేదు! ఓ కాలవగట్టునో, రోడ్డు ప్రక్కనో ఓ గుడి కట్టేస్తే, ఆపక్కనీ, ఈ పక్కనీ ఓ కిలోమీటరువరకూ సర్కారు భూమిని కబ్జా చేసి, షాపులూ వగైరా కట్టించెయ్యొచ్చు--చందాలు వసూలుచేసి, ఓ వారం రోజులో, తొమ్మిది రోజులో మైకులతో హోరెత్తిస్తూ కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు జరిపించొచ్చు--ఇంకా--గొల్లపూడివారు చెపుతున్నవి అన్నీ జరుగుతూ వుండవచ్చు!  


ముఖ్యం గా, సాయిబాబా గుడి అయితే, సుప్రీం కోర్టు వాటిని ఎండోమెంట్స్ వారు స్వాధీనం చేసుకోవచ్చు అని స్పష్టం గా తీర్పు ఇచ్చినా, 'స్టేలు ' తెచ్చుకొని, చక్కగా అనుభవించొచ్చు! (ఇది నేను విన్నదే సుమండీ!)  


--కృష్ణశ్రీ