Monday, September 21, 2009

జీవనకాలం


రేపటి దేవుళ్ళు


దువ్వూరి రామిరెడ్డిగారు "పానశాల" అనే పద్యకావ్యంలో ఉమర్ ఖయ్యాం చేత ఇలా అనిపిస్తారు--'మునుపు మసీదువాకిట ముచ్చెలు దొంగిలిపోతి, పాతవై చినిగెను. నేడునున్ వందల చెప్పులకోసమె వచ్చినాడ; నెమ్మనము సెడంగ నియ్యెడ నమాజొనరింపగరాను, నీవు చచ్చినయెడ వీడిపోయెదవు--చెప్పువోలె నమాజు సైతమున్" అని. 


ఇదివరకోసారి మసీదుకి చెప్పులు దొంగతనం చెయ్యడానికి వెళ్ళాను. అవిప్పుడు చినిగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త చెప్పులకోసం మసీదుకు వెళుతున్నాను, కాని నమాజు చెయ్యడానికి కాదు. యెందుకంటే చచ్చాక చెప్పుల్లాగే నమాజు కూడా ఈ లోకం లో వదలి పోతావు--అని తాత్పర్యం.  


దండాలు సోములోరికి, భక్తి చెప్పులమీదికి--అన్న సామెత మనకీ వుంది. మరికొందరికి దేవుడి మీదకన్న వడపప్పుమీద, చక్రపొంగలి మీద వుంటుంది. మరి తిరుపతి వెంకన్న ఖరీదయిన దేవుడు కనుక ఆయన దగ్గర ఖరీదయిన ప్రసాదాలు రిబేటు మీద దొరుకుతాయి. అందుకనే చాలా మంది చవక ధరల్లొ దధ్ధోజనం, చక్రపొంగలి, వడలూ, లడ్డూలూ కొనుక్కొని తిని కడుపు నింపుకొంటారు. దేవుడి ప్రసాదం తిన్నాక పుణ్యం మాటేమో కాని, వెంటనే కడుపు నిండడం కూడా పుణ్యమే కదా! తప్పు లేదు!  


స్వామివారికి కైంకర్యం చేసే ప్రసాదాలు భక్తులు స్వయంగా చేతితోనే తయారు చేయాలని ఆగమ శాస్త్రకారులు నిర్దేశించిన సంప్రదాయం. రోజుకి ఖర్చయ్యే 80 వేల లడ్డూలను యెంతమంది భక్తులు తయారు చేస్తారో! మరెంతమంది ఆరగించి ఆనందిస్తారో! ఈ ప్రసాదాలు తయారు చేసే హక్కు అనాదిగా వస్తున్న మిరాసీదారుల కుటుంబాలున్నాయి.  


దేవుని ప్రసాదం బాగోగులని ప్రశ్నించకూడదని పెద్దలంటారు. దేవుడి ప్రసాదము ఎలావున్నా తినకపోతే కళ్ళు పోవడమో, ఇల్లు కాలిపోవడమో, మరేదో అనర్థం జరుగుతుందనో, ప్రతి కథల్లో, పురాణాల్లో పెద్దలు భయపెట్టారు. ఎలాగూ నోరుమూసుకొని, భక్తితో భక్తులు సేవిస్తారుగదా అని ఆ ప్రసాదాన్ని చిన్నచూపు చూసిన సందర్భాలూ వున్నాయి. 


అలాంటి చిన్నచూపు ఈ మధ్య వెంకటేశ్వరుని లడ్డూలమీద పడిందన్న విషయం తెలిసొచ్చింది. ఏడుకొండలవాని లడ్డూల్లో మేకులూ, బాకులూ లాంటివి ఈ మధ్య ఓ భక్తునికి దొరికాయట--లడ్డూతో పాటు ఒక మేకు కూడా దేవుడు ప్రసాదించాడని, ఈసారి ఏ మిడతో, ఉడతో, రూపాయిబిళ్ళో, బంగారం ముక్కుపుడకో దొరకవచ్చునని ఆ భక్తుడు ఉదారంగా ఆలోచించలేకపోయాడు. మరి స్థలపురాణాల ప్రకారం ఆ భక్తునికి ఎంతో కొంత పాపం వచ్చే వుంటుంది.  


లడ్డూలకు బూజు పట్టిందని మరొకాయన అన్నాడాట. బూజు పడితే దులుపుకొని, 'వెంకట రమణా' అని మూడుసార్లు ఉచ్చరించి మింగెయ్యాలికాని ఫిర్యాదులు చెయ్యడం మహా పాపం. కాగా ఆ బూజులోనే మనిషికి అమరత్వం సిధ్ధించే యోగాన్నో, బూజులాగా ఐశ్వర్యాలు అల్లుకొనే అదృష్టాన్నో దేవుడు ప్రసాదించాడని ఆ భక్తుడు ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడో తెలీదు. కాక ఆ బూజు తమ దగ్గర నిలవ వుండడంవల్ల వచ్చినది కావచ్చు. అయినా నిలవుంటే మనుషులే బూజుపట్టిపోతున్న ఈ రోజుల్లో లడ్డూల గురించి అలా ఆవేదన పడడం ఏమీ బాగోలేదు. దొరికింది మేకు కనక అయ్యగారు ఫిర్యాదు చేశాడుగానీ, లడ్డూలో స్వామివారి వజ్రమో, వైడూర్యమో దొరికివుంటే ఆయన ఫిర్యాదు చేసేవారా? లడ్డూ చుట్టూ నూరురూపాయల నోటువుంటే అలా నిందించేవారా? 


నాకయితే లడ్డూలో మేకులు రావడం అక్కడి వంటవారి అశ్రధ్ధగా కాక, భక్తులకు రాను రాను భక్తి సన్నగిల్లి పోవడానికీ, స్వామివారి ప్రసాదాలపై పవిత్రభావం లుప్తమైపోవడానికీ తార్కాణంగా కనిపిస్తోంది.  


ఆ విషయం బయటపడ్డాక మిరాసీ దారులు కోపంగా పత్రికలకెక్కారుకాని, కాస్త ఖర్చయితే అయిందనుకొని, రోజుకి రెండు మూడు లడ్డూల్లోనైనా--చిన్న బంగారం తునకలూ, స్వామివారి లాకెట్లూ పెట్టవలసింది. అప్పుడు భక్తులు తేలుకుట్టిన దొంగల్లాగ వందలాది లడ్డూలు కొనుక్కొని, రహస్యంగా బంగారాన్ని దాచుకొనేవారు. తేలుమందు కొన్నవారికి జయమాలిని ఫోటో ఉచితం అనో, పదిసార్లు సినిమా చూస్తే పాతచెప్పులు ఉచితం అనో ప్రకటనలు మనం చూస్తూ వుంటాం కదా!--అలా ఈ లోపాన్ని అవకాశం చేసుకోవడం తెలీని అమాయకులుగా నాకు వంటవారు కనిపిస్తున్నారు.  


ఎక్కువ ఔదార్యంగల ప్రముఖ భక్తులు మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శంకర్ దయాళ్ శర్మగారు--ఈ వివాదం గురించి బాధపడుతూ మన ఇళ్ళల్లో వంటల్లోనే రాళ్ళూ రప్పలూ వస్తాయి. అంత పెద్ద ఎత్తున చేసేవాటిలో వస్తే సర్దుకుపోవాలి అంటూ సర్ది చెప్పారు. చిన్నవంటల్లో రాయివస్తే పెద్దవంటల్లో బండరాయిరావచ్చు. చిన్నవంటల్లో మేకు వస్తే పెద్దవంటల్లో గంటస్థంభమో, గల్లాపెట్టో వుండొచ్చునన్నదే వారి తాత్పర్యం. ఆమాత్రం భక్తులు అర్థం చేసుకోకపోవడం శోచనీయం.  


లడ్డూల స్థాయిపెంచలేక--రాశినిపెంచుతూ కావలసినన్ని లడ్డూలు తయారుచేయలేక దేవస్థానం వారు ఈమధ్య యిబ్బంది పడుతున్నారట. మనిషికి రెండు లడ్డూలుమాత్రమే రేషన్ గా యిస్తున్నారట. అంటే దైవదర్శనం చేసుకున్నవారికి దేవుడు పదికిలోల పుణ్యం ఇవ్వొచ్చుకాని, దేవస్థానం వారు రెండు లడ్డూలు మాత్రమే ఇస్తారట. ఈ మధ్య దేవుడిని గంటలో దర్శించి, లడ్డూల కోసం నాలుగు గంటలు క్యూలో నిలబడాల్సి వస్తోందని నిన్ననే స్వామిని దర్శించి వచ్చిన ఒక భక్తుడు చెప్పగా విన్నాను.  


ఈ సమస్య సులువుగా పరిష్కరించే మార్గాలు నాకు తెలుసు. గ్యాస్ పొయ్యిలు పెట్టి శాస్త్రకారుల మూడ్ ను వమ్ముచేసి దేశీయ ప్రమాణాల సంస్థ హయాంలో ప్రసాదాలు తయారుచేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. లడ్డూలలో మరిన్ని మేకులు, రాగినాణాలు, బూజువచ్చేటట్టు చేస్తే భక్తులకు ప్రసాదాలపై మోజు తగ్గుతుంది. లేదా విమానాశ్రయాల్లోలాగా లోహాన్ని గుర్తుపట్టే పరికరాలు లడ్డూలమీద పెట్టి పరిక్షించే పథకం పెట్టాలి.  


(13-9-1985)


(ఇరవైనాలుగేళ్ళక్రితం--ఆప్పటికింకా 'నిత్యాన్నదానపథకం' ప్రారంభం కాలేదు--కొండమీద అన్నిరకాల ప్రాసాదాలూ చవగ్గా దొరికేవి--ఆపం, వడ, దధ్ధోజనం, చక్రపొంగలీ, అరిశె లాంటివి అన్నీ!


ఇక రాళ్ళసంగతేమోగానీ, లడ్డూలు యెక్కువకాలం నిలవ వుంటాయని యెవరో చెపితే, మధ్యలో పటికబెల్లం అచ్చులని వుంచి, లడ్డూలు చుట్టేస్తున్నారు! ఇది ప్రవేశపెట్టిన కొత్తలో యెవరో నాకు లడ్డూ ప్రసాదం ఇవ్వగానే, వెంటనే నోట్లోవేసుకొని నమలబోయేసరికి, పళ్ళూడినంతపనయి, అప్పటినించీ 'తెనాలిరామలింగడి పిల్లి' లా భయపడిపోయి--ఆ లడ్డూ ముక్కని నలుగురిముందూ తినకుండా, దూరం గా తీసుకెళ్ళి, ఓ కాయితమ్మీద జాగ్రత్తగా చిదిపి, లడ్డూనీ, పటికబెల్లం అచ్చుల్నీ వేరుచేసి, విడివిడిగా చప్పరించడం నేర్చుకున్నాను!--కృష్ణశ్రీ)



Saturday, August 22, 2009

'జీవన కాలం'

మనం ఆంధ్రులం
నేను శంబల్పూరు వెళ్ళిన తొలిరోజుల్లో తెలుగుమాట ఎక్కడా వినిపించేది కాదు. ఎక్కడైనా తెలుగు ముఖం కనిపిస్తుందా, తెలుగు మాట వినిపిస్తుందా అని నేనూ మా ఆవిడా తెగ ఆరాటపడిపోయేవాళ్ళం. కొన్నాళ్ళకి అదొక రుగ్మత అయి, మనోవ్యాధి కింద పరిణమించింది. రెండు, మూడు తమిళ కుటుంబాలుండేవి. వాళ్ళంతా చాలా పొత్తుగా వుండేవారు. ఉద్యోగాలతో, అంతస్తులతో నిమిత్తం లేకుండా సాయంకాలాల్లో కలిసి అరవం లో ఆనందం గా కబుర్లు చెప్పుకుంటూండేవారు—వినే ఒరియావాళ్ళు ఈర్ష్యపడేలాగ. మేమూ అలాగే రెండు కుటుంబాలు దొరికితే బాగుండునని వాచిపోయేవాళ్ళం.

ఒకటి, రెండు వారాలు గడిచాక—ఒకాయన పక్కవీధిలోంచి వచ్చాడు. మా ఆవిడా, నేనూ షికారు వెళ్ళడం చూసి తెలుగువాళ్ళమని పోల్చాడట. ఎలాగన్నాను. ఒరియా ఆడవాళ్ళు సాధారణం గా తలలో పువ్వులు పెట్టుకోరు. మనవాళ్ళు విధిగా చేసుకునే అలంకరణనిబట్టి పోల్చాడు.

ఆయన మాతో చెప్పిన మొదటి అంశం: “అయ్యా! మీరు తెలుగువాళ్ళలాగ వున్నారు. ఆ పదో ఇంటాయన కుటుంబరావని—మంచివాడు కాదు. అతనితో మాట్లాడకండి” అని. అదే మా కలయికలో జరిగిన సంభాషణ. మేం తెల్లబోయేలోగా వెళ్ళిపోయాడు.

మరోనాలుగురోజులకు కుటుంబరావుగారొచ్చారు. “బాబూ—ఆ బాబూరావు మీ ఇంటికి రావడం చూశాను. వాడు బరంపురం మనిషి. అప్పులుచేసి బతుకుతాడు. పీనాసి. వాడిని గుమ్మం ఎక్కనివ్వకండి.” చెప్పాడు. మేం నిర్ఘాంతపోయాం. ఇలా ప్రవాసం లో మొదటిసారి ఆంధ్రుల పరిచయం కలిగింది.

నాకింకా యావ పోక, కనిపించిన మరో పాతిక కుటుంబాల్ని చేర్చి, మిత్రుల్ని పోగుచేసి, అందరితో ఉగాదికి ఒక నాటిక వెయ్యడానికి సంకల్పించాను. క్రమం గా కొందరు పెద్దల్లో సణుగుడు వినిపించింది. చివరలో తేలిన విషయం ఏమిటంటే—తెలుగువారు ఒక సంఘం గా ఏర్పడడం కొందరికి ఇష్టం లేదట. “మేం పదేళ్ళుగా ఇక్కడ వుంటున్నాం. ఇంతకాలం అవసరం లేని సంస్థ ఇప్పుడెందుకూ!” అన్నాడాయన.

“అయ్యా! ప్రవాసం వచ్చిన తెలుగువాడికి—పది తెలుగు మొహాలు ఒకచోట కనిపిస్తే సంబరం గా వుంటుంది” అన్నాను.

“సంబరంగా వున్ననాడు వెదుక్కొని కలుస్తాడు. ఆంధ్ర ప్రజలకి సంస్థ ప్రారంభిస్తే—ఒరియా వాళ్ళకి మనమీద అనుమానం వస్తుంది. ఉద్యమం లేవదీసి వెళ్ళగొడతారు” అన్నాడు. ఇంతగొప్ప ఆలోచన నాకు రానందున నిర్ఘాంతపోయాను. మరికొంతమంది “ఇదంతా ఆయన సొంత డబ్బా వాయించుకోడానికి చేస్తున్నాడయ్యా” అన్నారు. మొత్తం మీద ఏ అంధ్రుడూ సంఘీభావాన్ని సరైన దృక్పథం తో అర్థం చేసుకోలేకపోయాడు. ఉగాది నాటకాన్ని చూడవచ్చిన ఒరియా వారు అభినందించారు. ఆంధ్రులు చెవులు కొరుక్కొన్నారు. ఉగాది నాడు ప్రారంభించిన సంస్థ ఆ రోజే మూలబడింది.

మరి తమిళులు ఢిల్లీలో, బొంబాయిలో సంస్థలుగా ఏర్పడి ఎంతో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక కుటుంబం లాగ ఎలా బతుకుతున్నారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

ఏమైనా అవసరం లేని విషయం లో ఆవేశం ఆంధ్రుడి జన్మ హక్కు. ఇద్దరు కలిస్తే తప్పనిసరిగా అభిప్రాయభేదం రాకపోతే ఆంధ్రుడికి తోచదు. ప్రతి వ్యక్తి ఒక ద్వీపం. అతనిచుట్టూ చిన్ని నీల తెర వుండాలి—నీతిలోనయినా, అవినీతిలోనయినా. ఉక్కుఫ్యాక్టరీకోసం మనవాళ్ళెందరో చనిపోయారు. పొరుగురాష్ట్రం లో ఫ్యాక్టరీ వచ్చింది! మనకింకా పునాదులు తవ్వుతున్నారు. ఏ విషయం లోనైనా చూడండి—రాష్ట్రానికి సంబంధించిన మంచిపనికి—తమిళనాడులో అన్ని పార్టీలూ ఒకటవుతాయి. మనవాళ్ళు అదేదో వ్యక్తిగతమయిన ప్రలోభం తో కీచులాడుకోకపోతే తోచదు!

ఉమ్మడి మద్రాసు రాష్ట్రం లో ముఖ్యమంత్రిగా వుండే చక్రవరి రాజగోపాలాచారిగారు రోడ్ల ఇంజనీర్ల అవినీతిగురించి ఇలా అన్నారట “అరవదేశం లో ఇంజనీర్లు రోడ్లువేసి లాభాలు తింటారు. తెలుగు ఇంజనీర్లు కంకరే తినేస్తారు” అని.

(08-10-1982)

(అప్పటికీ, ఇప్పటికీ, దాదాపు 27 సంవత్సరాలలో యెంతమార్పు వచ్చిందో—నిన్నటిదాకా అసెంబ్లీ సమావేశాలని టీవీల్లో చూసినవాళ్ళెవరైనా—గుండెలమీద చెయ్యివేసుకొని చెప్పగలరా?.......కృష్ణశ్రీ)

Tuesday, August 11, 2009

జీవన కాలం

స్వతంత్రం వచ్చింది
ఓ కుర్రాడు—ఈదేశానికి స్వతంత్రం వచ్చిన 20 సంవత్సరాలు తర్వాత పుట్టినవాడు ……..కాపీ కొట్టడానికి అవకాశం ఇవ్వలేదని సాటి మితృలతో కలిపి టీచర్ని కొట్టాడు…….తండ్రి కుర్రాడిని కొట్టాడు.
యువకుడు తన మితృలందరిని పోగేసి, ఇంటికి వచ్చి తండ్రిని నిలదీసేసరికి, ఆ తండ్రి……రెండుచేతులూ జోడించి, తనకొడుకుని శిక్షించినందుకు తనకొడుక్కే క్షమాపణ చెప్పాడు.
మరి దేశానికి స్వాతంత్ర్యం రాలేదని యెవరంటారు?
* * *
పెళ్ళయి కాపురం చేస్తున్న దంపతులు రెండో ఆట సినిమా చూసి, ఇంటికి వస్తున్నారు. (ఇది ఇటీవల బొంబాయిలో జరిగిన ఉదంతం కాదు. దాదాపు 8 సంవత్సరాల క్రితం ఒరిస్సాలో జరిగినది)
—ఇద్దరు…..స్వతంత్రం పుట్టిన పదేళ్ళకే పుట్టినవాళ్ళూ…..ఆమెను తమతో పంపించమని…….భర్త….కొట్టబోతే…..”ఈరాత్రి మాతో గడిపిన భార్యని జీవితామంతా మిగుల్చుకొంటావా……ఇద్దరూ గల్లంతయిపోతారా?” …….భర్త చెయ్యత్తి కొడితే, అతన్ని కొట్టి, చంపకుండా అక్కడే వదిలేసి, యేడుస్తున్న భార్యని తీసుకెళ్ళారు.
ఈ దేశం లో వాళ్ళు పుట్టడానికి పది సంవత్సరాల ముందే స్వాతంత్ర్యం వచ్చింది.
* * *
ఓ రాష్ట్రం లో ఓ పోలీసాఫీసరు, స్వాతంత్ర్యం రావడానికి దాదాపు రెండు దశాబ్దాల అవతల పుట్టినవాడు—ఓ మహానగరం లో నడిబొడ్డున గుడిసెలు వేసుకున్న స్థలం మీద కన్ను వేశాడు……..పదిహేను సంవత్సరాలుగా……ఆస్థలాన్ని యెలా ఖాళీ చేయించాలో తెలియక……..యెవరూ కొనలేదు…….పోలీసాఫీసరుగారి మద్దతుతో చకచకా ఒకాయన కొన్నాడు……తెల్లవారేసరికి గుడిసెలు నేలమట్టమయ్యాయి…..ఎంక్వైరీ అన్నారు……..పెరిగే ప్రభుత్వంలో పెద్దమనుష్యుల్ని నేలమట్టం చేస్తానన్నాడు……..ఎంక్వైరీ ఆగిపోయింది.
ఆఫీసరు ఆనందంతో రెటైరయి, హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు!
ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇంకా 35 సంవత్సరాలే అయ్యింది!
13-08-1982