"రబ్బరు" కోపం
ఈమధ్య మా పెద్దబ్బాయి చాలా హుషారుగా వుంటున్నాడు. వాడి మనస్సులో యేదో మహత్తరమయిన ఆలోచనలు కదులుతున్నప్పుడే ఆ హుషారు తెలుస్తూంటుంది. రెండ్రోజుల తర్వాత ఆ ఆలోచన సారాంశం నాకర్థమయింది.
"నాన్నా! నువ్వేదయినా ఫ్యాక్టరీ తెరిచే ఆలోచన చెయ్యమన్నావు కదా?"
"అవును"
"బ్రహ్మాండమయిన ఫ్యాక్టరీ తెరిచే ఆలోచన చేశాను"
"యేమిటా ఫ్యాక్టరీ?"
"రబ్బరు బొమ్మల తయారీ"
నాకర్థం కాలేదు. "రబ్బరు బొమ్మలా? అంటే చిన్నపిల్లలు ఆడుకోడానికా?"
"కాదు. పెద్దవాళ్ళు చావగొట్టడానికి లేదా పెద్దవాళ్ళు ఒకరినొకరు చావగొట్టుకోకుండా వుండడానికి ఈ రబ్బరు బొమ్మలు వుపయోగిస్తాయి."
ఇంకా నాకర్థం కాలేదు. అప్పుడు వివరం గా చెప్పుకొచ్చాడు.
ఈ ఆలోచన ప్రథాని ఇందిరాగాంధీ గారిదట. ఆవిడ కొడుకులు ఒకరినొకరు చిన్నప్పుడు కొట్టుకొంటారనే ఆలోచన ఆ మధ్య మరీ యెక్కువయినప్పుడు, ఆవిడ కంగారుపడి, ఏం చెయ్యాలా అని బాగా ఆలోచించి విదేశాలకి వెళ్ళినప్పుడు ఓ రబ్బరు బొమ్మని కొని తీసుకొచ్చి యిద్దరికీ యిచ్చారట. వాళ్ళకి ఒకరిమీద ఒకరికి కోపం వచ్చినప్పుడు దాన్ని రెండు దెబ్బలు వేస్తే, కోపం తగ్గిపోయేదట.
ఈ ప్రయోగం ఫలించిందని ఆవిడ చెప్పినప్పట్నుంచీ మా వాడి బుర్రలో రైళ్ళు పరిగెత్తాయి.
అసలు ఈ ఆలోచనని మావాడు కాస్త మెరుగుపరిచాడు. యెలాగంటే, నీకు యెవరిమీద కోపం వుందో, వాళ్ళ ఫోటోని ఫ్యాక్టరీకి పంపిస్తే, ఆ ఆకారం బొమ్మ తయారు చేస్తుంది. ఆ లెక్క ప్రకారం పార్లమెంటులో వ్యతిరేక పక్షాలవారందరూ ప్రథాన మంత్రి బొమ్మలు, కొందరు ప్రతిపక్షల బొమ్మలు - ఇలా విరివిగా తయారు చెయ్యచ్చు. తమకోపాన్ని పార్లమెంటులోనో, శాసన సభలోనో చూపించే బదులు - పార్లమెంటు సభకి వచ్చేముందు ఆ బొమ్మని రెండు దెబ్బలు కొడితే ఆవేశం తగ్గుతుంది. శాసన సభలు - పూజామందిరాల్లాగ మరింత పవిత్రం గా వుంటాయి.
మావాడు చెప్పేదేమిటంటే శాసన సభల్లో ప్రశాంతత దృష్ట్యా గవర్నమెంట్ ఈ రబ్బరు బొమ్మల్ని కొని సరఫరా చెయ్యవచ్చునంటాడు.
ఈ మధ్య కొన్ని రాష్ట్రాల శాసన సభలలో ఇలా చాలా చోట్ల సభ్యులు కోపాలు తెచ్చుకోడానికి కారణం యిలాంటి రబ్బరు బొమ్మలు లేకపోవడమేనని.
అలాగే కాలేజీ ప్రిన్సిపాల్స్ మీద కోపం వున్న విద్యార్థులుంటారు. ప్రమోషన్ ఇవ్వలేదని బాస్ మీద కోపం వున్న వుద్యోగులుంటారు. ఆస్తి పంచివ్వలేదని తండ్రులమీద కోపం పెంచుకున్న కొడుకులుంటారు. భర్తలు చెప్పిన మాట వినలేదని కోపం వున్న భార్యలుంటారు (వీళ్ళకీ రహస్యం గా భర్తను రెండు దెబ్బలు కొట్టడానికి సరసమయిన ధరలకి సరఫరా చేస్తాడట) యెవరికోపం వాళ్ళు తీర్చుకోడానికి ఇలా రబ్బరు బొమ్మలు సహకరిస్తాయి.
కొన్నాళ్ళయాక పొద్దుటే వ్యాయామం లాగా - లేవగానే యెవరి శత్రువుల్ని వాళ్ళు తనివితీరా చావగొట్టి, శాంత మూర్తుల్లాగ, నవ్వుల్తో ఇస్త్రీ చేసిన చలవబట్టల్తో అంతా పవిత్రం గా యిళ్ళలోంచి బయటకి రావచ్చు. యిలా వాడు చాలా ఆవేశం గా యెన్నో ఆలోచనలు చెప్పాడు.
వినగా ఈ ఫ్యాక్టరీ లాభసాటిగానే వుంటుందనిపించింది.
"నమూనాలేమయినా తయారుచేశావా?" అన్నాను.
"ఉపయోగిస్తుందని అందాకా మా ఆఫీసరు బొమ్మ తయారు చేసుకొన్నాను. అమ్మకి మీ బొమ్మ చేసిచ్చాను" అన్నాడు ఆనందం తో ఉర్రూతలూగిపోతూ.
(16-3-1984)
(పాశ్చాత్య దేశాల్లో, ఇదివరకటి కాలం లో, యెవరైనా తప్పు చేస్తే, మతగురువులు కొరడా దెబ్బల్ని శిక్షగా విధించేవారట. అదే రాజకుటుంబం లో యెవరైనా తప్పు చేస్తే కొరడా దెబ్బల్ని తినడానికి 'వ్హిప్పింగ్ బాయ్స్ ' అని యేర్పాటు వుండేదట. రాజ కుటుంబీకుడి బదులు ఆ బాయ్స్ ని కొరడాలతో కొట్టేవారన్నమాట. మన దేశం లో కూడా కోపిష్టి రాజుగారి కొడుకులు గురువుగారిదగ్గర చదువుకొంటుంటే, వాళ్ళని దండించాల్సి వస్తే, గురువుగారు రాజు కొడుకుని కాకుండా పక్క కుర్రాణ్ణి కొట్టేవారట!
ఇలాంటి ప్రక్రియని, తన కొడుకు ఆలోచనగా మలిచాడు చమత్కారి గొల్లపూడి! బాగుంది కదూ?
........కృష్ణశ్రీ)