Saturday, July 3, 2010

జీవనకాలమ్

క్రీడ--నీడ

బంతి ఆట వింత ఆట అని ఈ ప్రపంచ కప్పు పోటీలు నిరూపించాయి. క్రీడల నీడలు వింతగా, విడ్డూరం గా, కొండొకచో భయంకరంగా వుంటాయని వింటున్న కథలు చెప్తున్నాయి. బంతి ఆటలో ఎవరు గెలుస్తారన్నది ఒక పోటీ అయితే, ఎవరు గెలుస్తారో తేల్చుకొనే జూదం లక్షలు, కోట్ల రూపాయలతో ప్రపంచమంతా సాగుతున్నది. మొన్న టెన్నిస్ లో మార్టినా నవ్రతిలోవా పదోసారి ఛాంపియన్ కానందుకు ఒకాయన బాధపడుతుంటే, మార్టినెజ్ గెలిచినందుకు నాలుగు లక్షల పందెం గెలిచానని మరొకాయన సంబరపడుతున్నారు.

ఒకరికి వినోదం, మరొకరికి విషాదం అన్న విషయం మిగతా ఆటల్లో ఏమోకాని బంతాట విషయం లో నిజమని రుజువయింది.

ప్రపంచ కప్పు స్థాయికి ఎదిగి, ఆటలో పొరపాటున తన దేశానికే గోల్ చేసి, బాధపడిన కొలంబియా ఆటగాడు ఎస్కోబార్ కు తమ నగరవాసులే తారసపడి, "గోల్ చేసినందుకు థాంక్స్" అని అతన్ని కాల్చి చంపారు. ఇది క్రీడల పట్ల వ్యామోహం లో మనిషి నీచత్వానికి ఈ శతాబ్దానికే మచ్చగా గుర్తుండిపోతుంది. ఎస్కోబార్ మృతికి ప్రపంచమంతా దురపిల్లింది. దేశమంతా అంత్యక్రియలకు కదిలివచ్చింది. నాలుగేళ్ళ పాప అతని దేహం మీద ఓ పువ్వుని వుంచడం అతి హృదయ విదారకమయిన దృశ్యం.

అల్బేనియా గెలవాలని తన పెళ్ళాన్ని, బిడ్డనీ పందెం కాసి ఓడిపోయిన ఓ క్రీడాప్రియుడు మనల్ని అంతగా ఆశ్చర్యపరచడు. మనకి అలాంటి వ్యసనపరులు ధర్మరాజులోనూ, ఆంగ్ల సాహిత్యం లో థామస్ హడ్డీ నవల "మేయర్ ఆఫ్ కాస్టర్ బ్రిడ్జి" లో కథానాయకుడు హెంబెర్డ్ లోనూ కనిపిస్తారు.

బల్గేరియా గెలుపుకు కారణమయిన స్టాయికోవ్ ను ఎలా అదుపులో పెట్టాలి? అని ఇటలీ బంతాట కోచ్ ని ఓ పత్రికా విలేకరి ఆడిగాడట.

"ఏమో అర్థం కావడం లేదు. పిస్తోలు గురి చూపించాలేమో?" అన్నాడట సాబీ అనే ఆ కోచ్. ఇది క్రీడల్లో ఎదుటి ఆటగాళ్ళమీద అతి సరసమయిన సమీక్ష.

ఇదిలా వుండగా ప్రపంచ కప్పు ఛాంపియన్ జర్మనీని తన గోల్ తో ఓడించిన బల్గేరియా ఆటగాడు స్టాయికోవ్ ఆటని చూసి పట్టలేని ఆనందం తో, షాక్ తో స్టాయికోవ్ తల్లికి మూడోసారి గుండెపోటు వచ్చిందిట. 47 ఏళ్ళ ఆ గుండెకాయ గట్టిది. ఆమె ప్రాణానికి ముప్పు రాలేదు.

బల్గేరియా విజయానికి ఉబ్బితబ్బిబ్బయి, ఒళ్ళు మరచి తప్పతాగిన భర్తని, కూరల కత్తితో పొడిచి చంపింది బల్గేరియాలో ఓ మహాసాధ్వి.

ప్రపంచమంతా ఆత్రుతగా ఎదురుచూసిన మారడోనా ప్రతిభని కళ్ళారా తిలకించక ముందే, మాదక ద్రవ్యాలు వాడిన నేరంకింద అతనిని ఆట నుంచి వెలివేశారు. తన బిడ్డల సాక్షిగా మత్తుపదార్థాలు వాడలేదంటూ కళ్ళ నీళ్ళ పర్యంతం అయి మారడోనా ఇంటికి తరలాడు. మారడోనా ఆటని చూసే సదవకాశాన్ని తమకి పోగొట్టినందుకు ఓ పాకిస్తాన్ లాయరు ప్రపంచకప్పు అధికారుల మీద 25 డాలర్ల నష్టపరిహారానికి కేసు పెట్టాడు. అధికారుల్ని కోర్టుకి హాజరు కావాలంటూ పాకిస్తాన్ కోర్టు తాఖీదు ఇచ్చింది!

అయ్యా, వెర్రి వెయ్యి విధాలన్నారుగాని, బంతాట వెర్రికి 'వెయ్యి' చాలదేమోననిపిస్తున్నది.

స్పెయిన్ ఆటగాడు లూయీ ఎన్రిక్ ముక్కును బద్దలుకొట్టినందుకు ఇటలీ ఆటగాడు మారో టాసోటీకి ప్రపంచకప్పు అధికారులు 40.65 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలన్నారు. ఇంత ఖరీదయిన ముక్కు ఎన్రిక్ కు వుండడం నిజం గా ఈర్ష్య కలిగిస్తున్నది.

(16-07-1994)

==> పదహారు సంవత్సరాల క్రితం ప్రపంచకప్ సాకర్ సందర్భం గా ఆయన వ్రాసిన వ్యాసమిది.

ఇప్పుడు పందాలు కోట్ల లోకీ, బిలియన్లలోకీ పెరిగాయి.

ప్రపంచం ఎస్కోబార్ నీ, ఆట మారడోనా లాంటివాళ్ళని దూరం చేసుకొంది.

ఇప్పుడు ఫేవరిట్ బ్రెజిల్ సెమీ ఫైనల్ లో, నెదర్లాండ్స్ చేతిలో, సెల్ఫ్ గోల్ తో ఓడిపోవడానికి కారణమైన ఫిలిప్ మెలో పరిస్థితి యేమిటో--పాపం!

ఇంకేమైనా మారిందా?

--కృష్ణశ్రీ

No comments: