Saturday, August 22, 2009

'జీవన కాలం'

మనం ఆంధ్రులం
నేను శంబల్పూరు వెళ్ళిన తొలిరోజుల్లో తెలుగుమాట ఎక్కడా వినిపించేది కాదు. ఎక్కడైనా తెలుగు ముఖం కనిపిస్తుందా, తెలుగు మాట వినిపిస్తుందా అని నేనూ మా ఆవిడా తెగ ఆరాటపడిపోయేవాళ్ళం. కొన్నాళ్ళకి అదొక రుగ్మత అయి, మనోవ్యాధి కింద పరిణమించింది. రెండు, మూడు తమిళ కుటుంబాలుండేవి. వాళ్ళంతా చాలా పొత్తుగా వుండేవారు. ఉద్యోగాలతో, అంతస్తులతో నిమిత్తం లేకుండా సాయంకాలాల్లో కలిసి అరవం లో ఆనందం గా కబుర్లు చెప్పుకుంటూండేవారు—వినే ఒరియావాళ్ళు ఈర్ష్యపడేలాగ. మేమూ అలాగే రెండు కుటుంబాలు దొరికితే బాగుండునని వాచిపోయేవాళ్ళం.

ఒకటి, రెండు వారాలు గడిచాక—ఒకాయన పక్కవీధిలోంచి వచ్చాడు. మా ఆవిడా, నేనూ షికారు వెళ్ళడం చూసి తెలుగువాళ్ళమని పోల్చాడట. ఎలాగన్నాను. ఒరియా ఆడవాళ్ళు సాధారణం గా తలలో పువ్వులు పెట్టుకోరు. మనవాళ్ళు విధిగా చేసుకునే అలంకరణనిబట్టి పోల్చాడు.

ఆయన మాతో చెప్పిన మొదటి అంశం: “అయ్యా! మీరు తెలుగువాళ్ళలాగ వున్నారు. ఆ పదో ఇంటాయన కుటుంబరావని—మంచివాడు కాదు. అతనితో మాట్లాడకండి” అని. అదే మా కలయికలో జరిగిన సంభాషణ. మేం తెల్లబోయేలోగా వెళ్ళిపోయాడు.

మరోనాలుగురోజులకు కుటుంబరావుగారొచ్చారు. “బాబూ—ఆ బాబూరావు మీ ఇంటికి రావడం చూశాను. వాడు బరంపురం మనిషి. అప్పులుచేసి బతుకుతాడు. పీనాసి. వాడిని గుమ్మం ఎక్కనివ్వకండి.” చెప్పాడు. మేం నిర్ఘాంతపోయాం. ఇలా ప్రవాసం లో మొదటిసారి ఆంధ్రుల పరిచయం కలిగింది.

నాకింకా యావ పోక, కనిపించిన మరో పాతిక కుటుంబాల్ని చేర్చి, మిత్రుల్ని పోగుచేసి, అందరితో ఉగాదికి ఒక నాటిక వెయ్యడానికి సంకల్పించాను. క్రమం గా కొందరు పెద్దల్లో సణుగుడు వినిపించింది. చివరలో తేలిన విషయం ఏమిటంటే—తెలుగువారు ఒక సంఘం గా ఏర్పడడం కొందరికి ఇష్టం లేదట. “మేం పదేళ్ళుగా ఇక్కడ వుంటున్నాం. ఇంతకాలం అవసరం లేని సంస్థ ఇప్పుడెందుకూ!” అన్నాడాయన.

“అయ్యా! ప్రవాసం వచ్చిన తెలుగువాడికి—పది తెలుగు మొహాలు ఒకచోట కనిపిస్తే సంబరం గా వుంటుంది” అన్నాను.

“సంబరంగా వున్ననాడు వెదుక్కొని కలుస్తాడు. ఆంధ్ర ప్రజలకి సంస్థ ప్రారంభిస్తే—ఒరియా వాళ్ళకి మనమీద అనుమానం వస్తుంది. ఉద్యమం లేవదీసి వెళ్ళగొడతారు” అన్నాడు. ఇంతగొప్ప ఆలోచన నాకు రానందున నిర్ఘాంతపోయాను. మరికొంతమంది “ఇదంతా ఆయన సొంత డబ్బా వాయించుకోడానికి చేస్తున్నాడయ్యా” అన్నారు. మొత్తం మీద ఏ అంధ్రుడూ సంఘీభావాన్ని సరైన దృక్పథం తో అర్థం చేసుకోలేకపోయాడు. ఉగాది నాటకాన్ని చూడవచ్చిన ఒరియా వారు అభినందించారు. ఆంధ్రులు చెవులు కొరుక్కొన్నారు. ఉగాది నాడు ప్రారంభించిన సంస్థ ఆ రోజే మూలబడింది.

మరి తమిళులు ఢిల్లీలో, బొంబాయిలో సంస్థలుగా ఏర్పడి ఎంతో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక కుటుంబం లాగ ఎలా బతుకుతున్నారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

ఏమైనా అవసరం లేని విషయం లో ఆవేశం ఆంధ్రుడి జన్మ హక్కు. ఇద్దరు కలిస్తే తప్పనిసరిగా అభిప్రాయభేదం రాకపోతే ఆంధ్రుడికి తోచదు. ప్రతి వ్యక్తి ఒక ద్వీపం. అతనిచుట్టూ చిన్ని నీల తెర వుండాలి—నీతిలోనయినా, అవినీతిలోనయినా. ఉక్కుఫ్యాక్టరీకోసం మనవాళ్ళెందరో చనిపోయారు. పొరుగురాష్ట్రం లో ఫ్యాక్టరీ వచ్చింది! మనకింకా పునాదులు తవ్వుతున్నారు. ఏ విషయం లోనైనా చూడండి—రాష్ట్రానికి సంబంధించిన మంచిపనికి—తమిళనాడులో అన్ని పార్టీలూ ఒకటవుతాయి. మనవాళ్ళు అదేదో వ్యక్తిగతమయిన ప్రలోభం తో కీచులాడుకోకపోతే తోచదు!

ఉమ్మడి మద్రాసు రాష్ట్రం లో ముఖ్యమంత్రిగా వుండే చక్రవరి రాజగోపాలాచారిగారు రోడ్ల ఇంజనీర్ల అవినీతిగురించి ఇలా అన్నారట “అరవదేశం లో ఇంజనీర్లు రోడ్లువేసి లాభాలు తింటారు. తెలుగు ఇంజనీర్లు కంకరే తినేస్తారు” అని.

(08-10-1982)

(అప్పటికీ, ఇప్పటికీ, దాదాపు 27 సంవత్సరాలలో యెంతమార్పు వచ్చిందో—నిన్నటిదాకా అసెంబ్లీ సమావేశాలని టీవీల్లో చూసినవాళ్ళెవరైనా—గుండెలమీద చెయ్యివేసుకొని చెప్పగలరా?.......కృష్ణశ్రీ)

No comments: